అంతర్జాతీయంగ జరిగిన ముఖ్యమైన అంశాలు...

    2022 మే నెలలో స్కాండినేవియా దేశాలైన ఫిన్లాండ్ , స్వీడన్ లు ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ ( నాటో ) లో సభ్య దేశాలుగా చేరేందుకు ఆసక్తి కనబరుస్తూ దరఖాస్తులు చేసుకున్నాయి . వీటి సభ్యత్వ అంశం ఖరారు కావడానికి ఏడాది దాకా సమయం పడుతుంది . 

    * అయితే ఈ అంశం మీద వివిధ పెద్ద దేశాల మధ్య వివాదం చెలరేగింది . ఒక పక్క యూరప్ దేశాలు , అమెరికా ఈ ప్రకటనను స్వాగతించాయి . ఫిన్లాండ్ , స్వీడన్లు నాటోలో సభ్య దేశాలుగా మారేందుకు వీలైనంత మద్దతు ఇస్తామని నార్వే , డెన్మార్క్ దేశాలు ప్రకటించాయి . ఈ రెండు దేశాలకు అధికారికంగా సభ్యత్వం లభించే వరకు అవసరమైతే తాము రక్షణ , సైనిక సహాయం చేస్తామని అమెరికా ప్రకటించింది . 

    * మరో పక్క ఫిన్లాండ్ , స్వీడన్లు నాటోలో సభ్య దేశాలుగా చేరితే తాము వాటిపై సైనిక చర్యలకు దిగుతామని రష్యా హెచ్చరించింది . ఫిన్లాండ్ దేశం ఈ అంశంలో ముందడుగు వేస్తే తదుపరి పరిణామాలకు సిద్ధంగా ఉండాలని కూడా హెచ్చరించింది . 

    * టర్కీ దేశం కూడా ఫిన్లాండ్ , స్వీడన్లు నాటోలో చేరే ప్రయత్నాలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది . నాటోలో తమ సభ్యత్వాన్ని ఉపయోగించి పై రెండు దేశాలు అందులో చేరకుండా వీటో ద్వారా అడ్డుకుంటామని కూడా ప్రకటించింది . టర్కీ దేశం కుర్దులు , ఇతర వేర్పాటువాదులను తీవ్రవాదులుగా భావిస్తోంది . ఈ బృందాలకు స్వీడన్ , ఇతర స్కాండినేవియా దేశాలు మద్దతు ఇస్తున్నాయి . అందుకే టర్కీ వాటిని వ్యతిరేకిస్తోంది .

    ఇప్పటివరకు నాటోలో సభ్యత్వం ఎందుకు పొందలేదు ? 

    * ఫిన్లాండ్ తమ పొరుగు దేశమైన రష్యాతో సత్సంబంధాలు కొనసాగించేందుకు ఇప్పటి వరకు ఈ రకమైన పశ్చిమ దేశాల కూటములకు దూరంగా ఉంటూ వచ్చింది . నాటోలో చేరడం గానీ , పశ్చిమ దేశాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం గానీ చేస్తే రష్యా సహించదని ఫిన్లాండ్కు తెలుసు . అయితే ఇటీవల రష్యా ఉక్రెయిన్పై ఆక్రమణకు పాల్పడిన నేపథ్యంలో ఈ దేశానికి కూడా తమ భద్రతపై ఆందోళనలు చెలరేగుతున్నాయి . అందుకే నాటోలో చేరేందుకు సిద్ధపడుతోంది . 

    * స్వీడన్ సిద్ధాంత పరమైన కారణాల వల్ల ఇప్పటి వరకు నాటోలో చేరడానికి ముందుకు రాలేదు . కానీ ఇప్పుడు రష్యా నుంచి రక్షణ కోసం చేరడానికి సిద్ధపడుతోంది . 

    ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ ( నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లేదా నాటో ) ::

    * 1949 ఏప్రిల్ 4 వ తేదీన పలు యూరప్ దేశాలు , ఉత్తర అట్లాంటిక్ ప్రాంత దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న అంతర ప్రభుత్వ సైనిక కూటమి పేరే నాటో . రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్ విస్తరణ వాదాన్ని అడ్డుకునేటందుకు , యూరప్ దేశాల రాజకీయ సమైక్యతను ప్రోత్సహించేందుకు , యూరప్ దేశాలన్నింటికీ కలిసి ఉమ్మడిగా భద్రతను ఏర్పాటు చేసేందుకు దీన్ని వ్యవస్థాపించారు . 

    * దీని ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రస్సెల్స్ ఉంది . ఇందులో ప్రస్తుతం 30 సభ్య దేశాలు ఉన్నాయి . అందులో రెండు దేశాలు ఉత్తర అమెరికాకు చెందినవి , 28 దేశాలు యూరప్ ఖండానికి చెందినవి.

    * ఇందులోని ఏదైనా ఒక సభ్య దేశానికి సభ్య దేశం కాని ఇతర దేశాల నుంచి రక్షణ పరమైన సమస్యలు , ఘర్షణలు ఎదురైనప్పుడు మిగిలిన సభ్యదేశాలు పరస్పర భద్రతా సహకారం అందించుకునేందుకు ముందుగానే సిద్ధపడి ఉంటాయి . 

    యూకే , స్వీడన్ల మధ్య భద్రతా ఒప్పందం ::

    ఫిన్లాండ్ , స్వీడన్ దేశాలకు నాటోలో సభ్యత్వం లభించే వరకు అవసరమైతే వాటికి యూరప్ దేశాలన్నీ భద్రతా సాయం చేయాలని బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ 2022 మే 11 వ తేదీన పిలుపునిచ్చారు . పై రెండు దేశాలలో ఆయన పర్యటన జరిపిన సందర్భంలో ఈ ప్రకటన చేశారు . 

    * పై రెండు దేశాలకు బ్రిటన్తో ఇప్పటికే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి . దానితో పాటు కొత్తగా ఒక భద్రతా ఒప్పందంపై కూడా సంతకాలు చేశాయి . అదే కాకుండా ఉత్తర , ఉత్తర అట్లాంటిక్ , బాల్టిక్ సముద్ర ప్రాంత దేశాల ' బహుళ జాతీయ ఉమ్మడి సైనిక బృందం ' ఒకటి కూడా ఈ దేశాల భద్రతాంశాలను ఇప్పటికే పర్యవేక్షిస్తోంది . అమెరికా , జర్మనీ దేశాలు కూడా ఫిన్లాండ్ , స్వీడన్ దేశాలకు ఈ రకమైన హామీలు ఇచ్చాయి . 

    * ఫిన్లాండ్ , స్వీడన్ దేశాలు 2022 మే నెలలో నాటోలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి . అయితే ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరడానికి ప్రయత్నించిన నేపథ్యంలోనే ఆ దేశంపై రష్యా యుద్ధానికి దిగిన కారణంగా పై రెండు దేశాలు తమ సొంత భద్రతపై ఆందోళనలు చెందుతున్నాయి .

    అమెరికాలో గడువు ముగిసిన వర్క్ పర్మిట్ల చెల్లుబాటు 540 రోజులకు పొడిగింపు ::

    యూఎస్లో గ్రీన్కార్డు దరఖాస్తుదారులు , హెచ్ 1 బీ వీసా హోల్డర్ల జీవితభాగస్వాములు సహా కొన్ని ఇమ్మిగ్రెంట్ కేటగిరీలకు చెందినవారి వర్క్ పర్మిట్ కాలపరిమితిని 18 నెలలు పొడిగిస్తున్నట్లు అమెరికా 2022 మే 4 న ప్రకటించింది . దీంతో పనిచేస్తున్న పలువురు భారతీయ ఐటీ ఉద్యోగులకు ఊరట లభించనుంది . కాలపరిమితి ముగిసిన వర్క్పర్మిట్లకు 18 నెలల పొడిగింపు ఇచ్చే వెసులుబాటు మే 4 నుంచి అమలవుతోంది . ప్రస్తుతం ఈ చెల్లుబాటు గడువు 180 రోజులు . తాజా పెంపుతో ఇది 540 రోజులుకు చేరుకుంది . ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కార్డు ( ఈఏడీ ) ల రెన్యూవల్కు దరఖాస్తులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా పౌరసత్వ , వలసల సేవల విభాగం ( యూఎస్ సీఐఎస్ ) డైరెక్టర్ తెలిపారు . తాజా నిర్ణయంతో అమెరికాలో ఉద్యోగుల కొరత కొంత తగ్గడంతో పాటు వలసదారుల కుటుంబాలకు కూడా ఆర్ధికంగా సహకారం లభిస్తుందని బైడెన్ సర్కారు వెల్లడించింది . ఈ నిర్ణయంతో దాదాపు 87 వేల మంది వలసదారులకు తక్షణమే లబ్ధి చేకూరడంతో పాటు దాదాపు 4.20 లక్షల మంది వలసదారులు పని అనుమతులు కోల్పోకుండా ఉంటారని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ నేత అజయ్ జైన్ పేర్కొన్నారు.

    అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి అధికారికంగా తప్పుకున్న రష్యా ::

    రష్యా ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు తమ మీద విధిస్తున్న ఆంక్షలకు ప్రతిస్పందిస్తూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి అధికారికంగా వైదొలగింది . 

    * అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని అయిదు దేశాలకు చెందిన అంతరిక్ష సంస్థల శాస్త్రవేత్తలు కలిసి ఉమ్మడి సహకారంతో నిర్మించారు . ఆ ఐదు అమెరికాకు చెందిన సంస్థల నాసా , రష్యాకు చెందిన రాస్ కాస్మోస్ , జపాన్కు చెందిన జాక్సా , కెనడా అంతరిక్ష సంస్థ , యూరోపియన్ అంతరిక్ష సంస్థ . 

    * ఇవన్నీ కలిసి ఉమ్మడిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిర్మాణంలోనూ , నిర్వహణలోనూ పాత్రలు పోషిస్తున్నాయి . దానికి ఆర్థిక వనరులు అందించడమే కాకుండా ఇతర రకాలుగా కూడా ఈ దేశాలు సహకరించుకుంటున్నాయి . 

    * అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కక్ష్యలో తిరిగేటప్పుడు దాని మార్గాన్ని సరి చేసే బాధ్యత రష్యా . నిర్వహిస్తోంది . అంతే కాకుండా భూమి నుంచి ఆ కేంద్రానికి , ఆ కేంద్రం నుంచి భూమికి వెళ్లే అంతరిక్ష వ్యోమగాములను రవాణా చేసే బాధ్యత కూడా రష్యా నిర్వహిస్తోంది . 

    * ఇటీవల ' స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్ అంతరిక్ష నౌక ఈ రవాణా పని ప్రారంభించే వరకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములు వెళ్ళడం , తిరిగి రావడం రష్యా అంతరిక్ష నౌకల ద్వారానే జరుగుతూ వచ్చింది . 

    అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ ( ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లేదా ఐఎస్ఎస్ ) ::

    * దీన్ని అమెరికా , రష్యా , జపాన్ , కెనడా , యూరప్ దేశాలు కలిసి ఉమ్మడిగా 1998 లో అంతరిక్షంలోకి ప్రయోగించాయి . ఈ ఐదు దేశాలు కలిపి మొత్తం 100 బిలియన్ డాలర్ల ఖర్చుతో దీన్ని నిర్మించాయి . అంతకు ముందు 1984 వ సంవత్సరంలో మొదటగా అమెరికా ఈ ఉమ్మడి అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆలోచనను వెలుగులోకి తెచ్చింది . 

    * దిగువ భూ కక్ష్యలో తిరుగుతూ , మానవులు నివసించే పరిస్థితులు కలిగిన ఉంటూ కృత్రిమ ఉప అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అని పిలుస్తున్నారు . ఇందులో కొన్ని నెలల పాటు వ్యోమగాములు నివసించిన తరువాత తిరిగి -భూమ్మీదకి వస్తారు . వారి స్థానంలో కొత్త వారు ఈ కేంద్రానికి వెళ్తారు . 1998 లో మొట్టమొదటగా ప్రయోగించిన ఈ కేంద్రం ప్రస్తుతం దిగువ భూ కక్ష్యలో ఉన్న అతి పెద్ద మానవ నిర్మిత ఉపగ్రహం . 

    * ఇది దాదాపు ప్రతీ 92 నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ తిరుగుతుంది . అంటే రోజుకి 15.5 సార్లు భూభ్రమణాలు చేస్తుంది . ఇది అంతరిక్షంలో సూక్ష్మ గురుత్వాకర్షణ , అంతరిక్ష వాతావరణాలపై పరిశోధనాశాలగా ఉపయోగపడుతోంది . ఇందులో నివసిస్తున్న వ్యక్తులు జీవశాస్త్రం , మానవ జీవశాస్త్రం , భౌతిక శాస్త్రం , ఖగోళ శాస్త్రం , వాతావరణ శాస్త్రం , ఇతర శాస్త్రాలపై వివిధ రకాల పరిశోధనలు జరుపుతున్నారు . 

    * దీన్ని మొదట 15 ఏళ్ళ పాటు పని చేయడానికి నిర్మించారు . తర్వాత ఆ కాలాన్ని కొనసాగిస్తూ పోతున్నారు . దీని యాజమాన్యం పలు అంతర ఒప్పందాలు , అంగీకారాల ద్వారా పై అయిదు దేశాల మధ్య ఏర్పాటైంది . ఇది 2030 వ సంవత్సరం వరకు పని చేస్తుందని ఆశిస్తున్నారు . ఈ కేంద్రాన్ని 2031 వ సంవత్సరంలో తొలగించాలని నాసా ప్రణాళికలు రూపొందించింది .

    పాకిస్తాన్కు ఆర్థిక సాయం చేసిన సౌదీ అరేబియా ::

     2022 ఏప్రిల్ నెలాఖరులో పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో పడిన సమయంలో సౌదీ అరేబియా ఆ దేశానికి 8 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించడానికి , దాన్ని సంక్షోభం నుంచి బయటపడేయడానికి అంగీకరించింది . 

    * పాకిస్తాన్కు కొత్తగా ప్రధానమంత్రి అయిన షెహబాజ్ షరీఫ్ ఇటీవల సౌదీ అరేబియా పాలకుడు మహ్మద్ బిన్ సల్మాన్ తో సమావేశం జరిపిన తర్వాత సౌదీ ఈ సాయం చేయడానికి అంగీకరించింది . 

    * విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం , అత్యధిక ద్రవ్యోల్బణం , కరెంట్ ఖాతా లోటు , కరెన్సీ విలువ తగ్గిపోవడం మొదలైన సమస్యల కారణంగా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఈ మధ్య కాలంలో క్షీణిస్తూ వస్తోంది .

    * ఈ ఆర్థిక సహాయంలో భాగంగా సౌదీ పాక్కు చమురు కొనుగోళ్లకు కూడా సాయం చేస్తుంది . దాంతో పాటుగా సౌదీ అరేబియా పాకిస్తాన్కు ఎరువుల కొనుగోలుకు 200 మిలియన్ డాలర్లు , జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి 80 మిలియన్ డాలర్లు , అంతర్గతంగా వరదల కారణంగా నివాసాలు కోల్పోయిన వారికి ఆశ్రయం కల్పించేందుకు , మానవతా సహాయం చేసేందుకు 100 మిలియన్ డాలర్లు ఇవ్వడానికి అంగీకరించింది . 

    * సౌదీ అరేబియా ఇంతకు ముందు కూడా పలు సార్లు పాకిస్తాన్కు ఆర్ధిక సహాయం అందించింది . 2019 ఫిబ్రవరి నెలలో పాకిస్తాన్లో దాదాపు 20 1 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారాలపై 20 సంతకాలు చేసింది . ఇందులో విద్యుత్ , పెట్రో రసాయనాలు , గనుల తవ్వకం . మొదలైన రంగాలలో పెట్టుబడులు ఉన్నాయి . 

    * తర్వాత 2021 వ సంవత్సరంలో సౌదీ అరేబియా మళ్ళీ 3 మిలియన్ డాలర్లను పాకిస్తాన్ కేంద్ర బ్యాంకులో డిపాజిట్లుగా ఉంచింది . తర్వాత 2022 మార్చి నెలలో సౌదీకి చెందిన ఒక చమురు కేంద్రాన్ని పాకిస్తాన్లో ప్రారంభించారు . దీని ద్వారా పాకిస్తాన్కు 100 మిలియన్ డాలర్ల విలువైన చమురు సేకరించేందుకు అవకాశం లభించింది . 

    *  ఈ రకమైన అప్పుల కారణంగా కొంత కాలం క్రితం పాకిస్తాన్ రుణ సంక్షోభంలో పడినప్పుడు చైనా 1.5 బిలియన్ డాలర్లను అందజేయడం ద్వారా సౌదీ అరేబియాకు చెల్లించవలసిన 2 బిలియన్ డాలర్ల రుణాలలో కొంత భాగం తిరిగి చెల్లించేందుకు సహాయపడింది . 

    * 2022 జనవరిలో పాకిస్తాన్ తమకు ఇవ్వవలసిన 3 బిలియన్ డాలర్ల రుణాన్ని ఏడాదిలోగా నాలుగు శాతం వడ్డీతో వెనక్కి తిరిగి ఇవ్వాలని సౌదీ అరేబియా డిమాండ్ చేసింది . తర్వాత అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనాకి వెళ్లి రుణ సహాయం కోరడం ద్వారా సౌదీ అరేబియా రుణాలను కొంత వరకు వెనక్కి చెల్లించారు .

    Post a Comment (0)
    Previous Post Next Post